బీజేపీ అభ్యర్థిని అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకున్నాం: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్

  • నామినేషన్లు వేసేందుకు వచ్చేవారిని అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం
  • గుంటూరు జిల్లా ఘటనలను ఐజీ దృష్టికి తీసుకెళ్లాం
  • అభ్యర్థులంతా ఇబ్బంది లేకుండా నామినేషన్లు వేయొచ్చు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారంటూ విపక్ష నేతలు అధికార వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ, నామినేషన్లను వేసేందుకు వచ్చే అభ్యర్థులను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చిత్తూరు జిల్లాలో నామినేషన్ వేసేందుకు వచ్చిన బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషనర్ చెప్పారు. జిల్లా కలెక్టర్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సయ్యద్ బాషా, ఇమ్రాన్ బాషాను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనలను ఐజీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నామినేషన్లు వేయవచ్చని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కొరత లేదని తెలిపారు. హైకోర్టు నిర్దేశించిన సమయానికల్లా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలపై వైసీపీ రంగులు తొలగించే ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.


More Telugu News