హమ్మయ్య....ఆయన వచ్చేశారు: 'భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన కథ' సుఖాంతం!
- భార్యను ఇంట్లో పెట్టి ఎనిమిది నెలల క్రితం బయటకు వెళ్లిన భర్త
- ఏమయ్యాడో తెలియక అయోమయం
- కృష్ణా జిల్లాలోని స్వగ్రామం వెళ్లినట్లు ఎట్టకేలకు గుర్తింపు
ముదిమి మీదపడి కృష్ణారామా అనుకోవాల్సిన వయసులో కష్టాలు వెన్నంటి నడిస్తే ఎవరి పరిస్థితైనా ఎలావుంటుందో చెప్పేందుకు గంగాధర్, బేబీ దంపతులు ఓ ఉదాహరణ. ఎనిమిది నెలల క్రితం భర్త స్వగ్రామానికి వెళ్లిపోవడం, అప్పటి నుంచి ఇంట్లో భార్య ఒక్కరే ఉండడం, బయటవారే కిటికీలోంచి భోజనం అందిస్తుండడం తదితర అంశాలు వెలుగు చూసి స్థానికంగా సంచలనమయ్యాయి. అసలు ఆ వృద్ధురాలి భర్త ఏమయ్యాడు? కావాలనే భార్యను ఇలా వదిలేశాడా? ఇంకేదైనా కారణం ఉందా? ఇలా పలు రకాల ఊహాగానాలు పత్రికల్లో వచ్చాయి. ఈ అంశం స్థానికంగా కలకలం రేపింది. ఎట్టకేలకు ఆమె భర్త ఆచూకీ లభించడంతో కథ సుఖాంతమయ్యింది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లోని ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ డివిజన్ గణేష్ నగర్లో గంగాధర్, బేబీ దంపతులు ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. గంగాధర్ రిటైర్డు వీఆర్ఓ. కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామస్థుడు. గ్రామంలో ఇతనికి ఇల్లు, స్థలాలు ఉన్నాయి. ఇవి అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉండడంతో తరచూ అక్కడికి వెళ్లి వస్తుంటాడు. అలాగే పదవీ విరమణ చేసినా పెన్షన్ కూడా మంజూరు కాకపోవడంతో ఆ పని కూడా ఉండేది.
ఈ పనులు చక్కబెట్టేందుకే ఎనిమిది నెలల క్రితం స్వగ్రామానికి వెళ్లాడు. గతంలోనూ అలాగే చేశాడు. ఇలా బయటకు వెళ్లినప్పుడు ఇంటి యజమాని ద్వారా భార్యకు భోజన ఏర్పాట్లు చేయించేవాడు. దీంతో వారు కిటికీలోంచి బేబీకి భోజనం అందించేవారు. ఇదే వివాదానికి దారితీసింది. ఈ విషయం పత్రికల్లో రావడంతో ఏదో జరిగిపోయిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
వెంటనే స్పందించిన హైదరాబాద్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ కమిటీ సహాయ సంచాలకులు పుష్పలత బేబీని కలిసి విచారించారు. ఆమెకు వైద్య పరీక్షలు చేయించి ఘటకేసర్ లోని కరుణ రథం వృద్ధాశ్రమంలో ఉంచారు. అనంతరం భర్త ఆచూకీ కోసం బేగంబజార్ ఠానాలో ఫిర్యాదు చేశారు. దీంతో గంగాధర్ కోసం పోలీసులు వెతకడం మొదలయ్యింది.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో గంగాధర్ ఉన్నట్లు అక్కడి అధికారుల నుంచి సమాచారం అందడంతో స్థానిక అధికారులు అతన్ని రప్పించి కరుణరథం వృద్ధాశ్రమానికి తీసుకువెళ్లారు. విచారణలో తాను ఎక్కడికి వెళ్తున్నది, ఎందుకు వెళ్తున్నది గంగాధర్ వివరించారు. వివరాలన్నీ విన్న అధికారులు వాటిపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు.
అయితే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఇప్పటికే జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఈ అంశం పై విచారణ నిర్వహిస్తుండడంతో నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో గంగాధర్ ను ఈ రోజు హాజరు పరచాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆ పనిలో ఉన్నారు.