చంద్రబాబు విఙ్ఞతకే వదిలేస్తున్నా: మంత్రి పెద్దిరెడ్డి

  • టీడీపీ ఉనికి కోల్పోతోందన్న బాధలో చంద్రబాబు ఉన్నారు
  • అందుకే, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు
  • చంద్రబాబు వాడే భాషకు ప్రజలు తలదించుకునే పరిస్థితి
స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో తమ పార్టీ నాయకులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనేక ఆరోపణలు చేస్తున్నారని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిన్న చంద్రబాబు తనపై ఆరోపణలు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో తమ జిల్లాల్లో చంద్రబాబు ఎప్పుడు పర్యటించినా ఆయనకు తాను ఒక్కడినే కనబడతానని, ‘నాకు బుద్ధి లేదని, సిగ్గు లేదని చంద్రబాబు అన్నాడు’ అని బాబు అలా మాట్లాడటాన్నిఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. చంద్రబాబు వాడే భాషను వింటున్న ప్రజలు ఇలాంటివాడు మన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారా? అని తలదించుకునే పరిస్థితి అని దుమ్మెత్తిపోశారు.

టీడీపీ ఉనికి కోల్పోతోందన్న బాధతో చంద్రబాబు తన ఇష్టానుసారం మాట్లాడటం తగదని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. టీడీపీ మెరుగ్గా పని చేస్తోందని భావిస్తే సతీశ్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు? డొక్కా మాణిక్య వరప్రసాద్, రెహ్మాన్ లు ఆ పార్టీని ఎందుకు వీడారో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. సతీశ్ రెడ్డి ప్రకటన చూసి చంద్రబాబు సిగ్గుపడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


More Telugu News