వైసీపీలో చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు

  • మాజీ ఎమ్మెల్యే తైనాల్‌ విజయ్‌ కుమార్‌‌తో కలిసి వైసీపీ తీర్థం
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ విజయసాయి రెడ్డి
  • ఇదివరకే జనసేనకు రాజీనామా చేసిన బాలరాజు
 గత అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైసీపీ కండువా కప్పుకున్నారు. కొంతకాలం క్రితమే జనసేనకు రాజీనామా చేసిన ఆయన మంగళవారం వైసీపీలో చేరారు. తన కుమార్తె డాక్టర్ దర్శిని, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, మరికొందరు నేతలతో కలిసి అధికార పార్టీలో అడుగుపెట్టారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కండువాలు కప్పి వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న పసుపులేటి బాలరాజు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. గిరిజన వర్గాల్లో పట్టున్న నాయకుడైన బాలరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో నాటి చింతపల్లి నియోజకర్గంలో తొలిసారి అసెంబ్లీకి వెళ్లిన బాలరాజు 2009లో పాడేరు నుంచి మరోసారి గెలిచి మంత్రి కూడా అయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాడేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ఆయన పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. ఆ తర్వాత జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన.. విశాఖపట్నంలో పవన్ లాంగ్‌ మార్చ్‌ను నిర్వహించిన రోజే జనసేనకు రాజీనామా చేశారు.


More Telugu News