దిల్‌సుక్‌నగర్‌లో రోడ్డుపై బోల్తాపడ్డ కోడిగుడ్ల వాహనం.. కాలు పెడితే జారే పరిస్థితి.. శుభ్రం చేసిన సిబ్బంది

  • రోడ్డుపై పగిలిపోయిన గుడ్లు
  • వెంటనే స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు
  • నీళ్లతో ఆ రోడ్డును శుభ్రం చేసి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్‌లో ఎల్లప్పుడూ రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్డుపై కోడిగుడ్లు తరలిస్తున్న వాహనం అదపుతప్పి బోల్తాపడింది. దీంతో రహదారిపై అవన్నీ పగిలిపోవడంతో కొందరు వాటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. కమలా ఆసుపత్రి ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది.

కోడిగుడ్లన్నీ రోడ్డుపైనే పగిలిపోవడంతో ఆ రోడ్డుపై నుంచి వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పగిలిన కోడిగుడ్ల కారణంగా కొన్ని ద్విచక్ర వాహనాలు జారి పడిపోయే అవకాశం ఉంది. రోడ్డుపై కాలు పెట్టినా జారిపోయే పరిస్థితి నెలకొంది.

దీంతో ద్విచక్రవాహనదారులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి తలెత్తడంతో వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు.  వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో అక్కడి చేరుకున్న సిబ్బంది నీళ్లతో ఆ రోడ్డును శుభ్రం చేసి వెళ్లారు.


More Telugu News