ఢిల్లీ నుంచి హుటాహుటిన వెనక్కు వచ్చిన కమల్‌నాథ్.. దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ

  • రాజ్యసభ నామినేషన్ల అంశంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన కమల్‌నాథ్
  • జ్యోతిరాదిత్య పేరు ప్రస్తావించని సీఎం
  • దిగ్విజయ్ సింగ్‌, మంత్రులతో రెండు గంటల భేటీ
మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారును కూల్చే ప్రయత్నం జరుగుతోందంటూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా తన అనుచరులైన 17 మది ఎమ్మెల్యేలతో కనిపించకుండా పోవడం ఇందుకు ఊతమిస్తోంది. రాత్రికి రాత్రే సంక్షోభంలో పడిన ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు అధిష్ఠానం ఆపసోపాలు పడుతోంది.

మరోవైపు, రాజ్యసభ నామినేషన్ల అంశాన్ని అధ్యక్షురాలు సోనియాతో చర్చించేందుకు నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం కమల్‌నాథ్.. ఎమ్మెల్యేల అదృశ్యవార్త తెలిసిన వెంటనే హుటాహుటిన రాష్ట్రానికి తిరిగొచ్చారు. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, మంత్రులతో కలిసి రెండు గంటలపాటు తాజా పరిస్థితిపై చర్చించారు. అనంతరం రాత్రి 10 గంటలకు అత్యవసరంగా కేబినెట్‌ను సమావేశపరిచారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 20 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.

కాగా, అంతకుముందు కమల్‌నాథ్ ఢిల్లీలో విలేకరులతో  మాట్లాడుతూ.. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తామని చెప్పారు. అయితే, జ్యోతిరాదిత్య విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు. జ్యోతిరాదిత్యను రాజ్యసభకు పంపాలని ఆయన వర్గం పట్టుబడుతుండగా.. ప్రియాంక గాంధీని పంపాలని మరో వర్గం డిమాండ్ చేస్తోంది.


More Telugu News