నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఇంటికి పిలిచి, డబ్బిచ్చి ఆదుకున్నది ప్రకాశ్ రాజే!: రాజా రవీంద్ర

  • ప్రకాశ్ రాజ్ తన కుమార్తె పెళ్లికి సాయం చేశారన్న రాజా రవీంద్ర
  • ఒక్క రూపాయి లాభం లేకపోయినా చేయూతనిచ్చారు 
  • మరో నటుడికి రూ.50 లక్షలిచ్చి ఆదుకున్నారని వెల్లడి
తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రాజా రవీంద్ర. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, అనేకమంది అగ్రహీరోలకు, నటులకు డేట్లు చూసే మేనేజర్ కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తన జీవితంలో స్ఫూర్తిగా నిలిచే అతి కొద్దిమందిలో ప్రకాశ్ రాజ్ ఒకరని తెలిపారు. తానెప్పుడూ ప్రకాశ్ రాజ్ డేట్లు చూడలేదని, కేవలం పరిచయం మాత్రమే ఉందని అన్నారు. అయితే, తన కుమార్తె పెళ్లి చేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఇంటికి పిలిచి మరీ డబ్బిచ్చి ఆదుకుంది ప్రకాశ్ రాజేనని వెల్లడించారు. ఇప్పటివరకు ఆయన ఆ డబ్బు గురించి మళ్లీ అడగలేదని, ప్రకాశ్ రాజ్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పడానికి ఇంతకంటే సరైన ఉదాహరణ ఇంకేం ఉంటుందని అన్నారు. ఆయనది మరో లైఫ్ అని పేర్కొన్నారు.

"నా వల్ల ఆయనకు ఒక్క రూపాయి కూడా ఉపయోగం లేదు. కానీ నాకు సాయం చేశారు. అదీ ప్రకాశ్ రాజంటే! మరోసారి, ఓ పేరుమోసిన నటుడు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉంటే ప్రకాశ్ రాజే దేవుడిలా కాపాడారు. ఆ నటుడు బాగా కుంగిపోయి, ఇక తనువు చాలించే స్థితిలో ఉన్నారని తెలుసుకుని నాకు ఫోన్ చేశారు. ఏంట్రా, వాడు అంత దారుణమైన పొజిషన్ లో ఉన్నాడా? వాడ్ని నా దగ్గరికి తీసుకురా అన్నారు. నేను ఆ నటుడ్ని తీసుకుని ప్రకాశ్ రాజ్ వద్దకు తీసుకెళ్లాను. నీ అప్పులన్నీ కలిపితే ఎంత? అని అడిగారు. రూ.50 లక్షలు ఉంటుంది అని ఆ నటుడు చెప్పాడు. దాంతో ప్రకాశ్ రాజ్ ఆ రూ.50 లక్షలు ఇచ్చి ఓ ప్రాణాన్ని నిలబెట్టారు" అని వివరించారు.


More Telugu News