కరోనా వైరస్ నుంచి ఇలా ప్రయోజనం పొందుదాం: ఆనంద్ మహీంద్రా
ట్విట్టర్ లో మూడు అంశాలతో ట్వీట్లు
పెట్రోలియం ధరల తగ్గింపును వాడుకోవాలి
చైనాకు ప్రత్యామ్నాయంగా కనిపించాలని సూచన
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఆందోళన రేకెత్తిస్తోంది. పరిశ్రమలు, ఇతర వ్యాపార, వాణిజ్యాలు దెబ్బతింటున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితిని అనుకూలంగా ఉపయోగించుకోవచ్చని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సూచించారు. దీనికి సంబంధించి మూడు పాయింట్లతో వరుసగా ట్వీట్లు చేశారు. ఇండియాకు సంబంధించినంత వరకు కరోనా సంక్షోభాన్ని ఏ మాత్రం వృథా చేసుకోవద్దన్నారు. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారో చూద్దామా..
మూడు అవకాశాలు ఉన్నాయి
‘‘కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం తలెత్తింది. ఇండియాకు సంబంధించినంత వరకు మాత్రం ఈ సంక్షోభ పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేసుకోవద్దు. ఈ పరిస్థితి నుంచి లాభం పొందడానికి మనకు మూడు అవకాశాలు ఉన్నాయి.
1. వినియోగాన్ని పెంచుకోవాలి
కరోనా కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు బాగా పడిపోయాయి. ప్రభుత్వం దీనిని అవకాశంగా తీసుకుని, దేశంలో వినియోగాన్ని భారీగా పెంచాలి. ఇదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తులపై భారీగా వచ్చే లాభాలు, దిగుమతుల భారం తగ్గడంతో వచ్చే ప్రయోజనాలను ఆర్థిక లోటును పూడ్చడానికి వినియోగించుకోవాలి.
2. చైనాకు ప్రత్యామ్నాయంగా నిలవాలి
వైరస్ తో అతలాకుతలమైన చైనాకు ప్రత్యామ్నాయం ఇండియానే అన్న భావనను ప్రపంచవ్యాప్తంగా కలిగించాలి. దేశంలో శానిటేషన్, స్వచ్ఛ ఉద్యమాన్ని చేపట్టి, భారీగా పర్యాటకులను ఆకర్షించే చర్యలు చేపట్టాలి.
3. పెట్టుబడి దారులు వచ్చేలా సంస్కరణలు తేవాలి
విదేశీ పెట్టుబడి దారులు చైనాకు బదులుగా ఇండియా వైపు దృష్టి సారించేలా విధానాల్లో సంస్కరణలు తేవాలి. దేశంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాయితీలు ఇవ్వాలి.