నిమిషాల వ్యవధిలో పాతాళానికి జారిపోయిన స్టాక్ మార్కెట్... రూ. 5 లక్షల కోట్ల నష్టం!

  • స్టాక్ మార్కెట్ పై కరోనా ఎఫెక్ట్
  • భారీగా నష్టపోయిన వరల్డ్ మార్కెట్
  • అదే దారిలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ
స్టాక్ మార్కెట్లో మరో బ్లాక్ మండే నమోదైంది. కరోనా ప్రభావం వరల్డ్ స్టాక్ మార్కెట్లను కుదేలు చేయగా, అదే ట్రెండ్ ఇండియాలోనూ కనిపించింది. ఈ ఉదయం మార్కెట్ సెషన్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే బెంచ్ మార్క్ సూచిక సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 5 లక్షల కోట్లకు పైగా హరించుకుపోయింది.

ఈ ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 1,222 పాయింట్లు పడిపోయి, 3.25 శాతం నష్టంతో 36,354 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 348 పాయింట్లు పడిపోయి, 3.12 శాతం నష్టంతో 10,646 పాయింట్లకు చేరింది. నిఫ్టీ-50లో కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఓఎన్జీసీ, వీఈడీఎల్, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ తదితర కంపెనీలు ఆరు శాతానికి పైగా నష్టపోవడం గమనార్హం. యస్ బ్యాంక్, బీపీసీఎల్, ఐఓసీ, సన్ ఫార్మా కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.

ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ల విషయానికి వస్తే, మరింత నష్టం నమోదైంది. నిక్కీ 5.65 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 4.35 శాతం, హాంగ్ సెంగ్ 3.56 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 2.18 శాతం, కోస్పీ 3.72 శాతం, సెట్ కాంపోజిట్ 5.11 శాతం, జకార్తా కాంపోజిట్ 3.85 శాతం, షాంగై కాంపోజిట్ 2.41 శాతం నష్టపోయాయి.


More Telugu News