కరోనా నుంచి బయటపడిన వందేళ్ల చైనా వృద్ధుడు.. ఇదో రికార్డు!

  • 13 రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు
  • చికిత్స అనంతరం పూర్తిస్థాయిలో కోలుకున్న వైనం
  • ఈ వైరస్ నుంచి బయటపడిన అత్యధిక వయస్కుడిగా గుర్తింపు
కరోనా వైరస్ సోకిన వందేళ్ల వృద్ధుడు దాని నుంచి పూర్తిస్థాయిలో బయటపడడం చైనాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కోవిడ్ 19 లక్షణాలతో బాధపడుతూ వూహాన్‌కు చెందిన వందేళ్ల వృద్ధుడు ఒకరు  గత నెల 24న హుబెయిలోని మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఆసుపత్రిలో చేరాడు.

ఫ్లూ తరహా లక్షణాలతో పాటు అల్జీమర్స్, బీపీ, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అతడికి వైద్యులు 13 రోజుల పాటు చికిత్స అందించారు. తాజాగా, అతడిని పరీక్షించిన వైద్యులు కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు. దీంతో అతడితోపాటు కోలుకున్న మరో 80 మందిని కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కరోనా వైరస్ నుంచి బయటపడిన అతి పెద్ద వయస్కుడిగా ఆ వృద్ధుడు రికార్డు సృష్టించాడు.

వూహాన్‌లో తొలిసారి వెలుగుచూసిన ఈ వైరస్ చైనాలో ఇప్పటి వరకు దాదాపు మూడు వేలమందికి పైగా పొట్టనపెట్టుకుంది. 80 వేల మందికిపైగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అలాగే, 70 దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. మన దేశంలో 39 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.


More Telugu News