ఏపీలో సీఎం జగన్​ పాలనపై టీ–కాంగ్రెస్​ నేత రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

  • ఏపీలో పరిస్థితి ‘పిచ్చోడి చేతిలో రాయిలా’ తయారైంది
  • తొమ్మిది నెలల వైసీపీ పాలన  ‘వెరీ అన్ ఫార్చ్యునేట్’
  • చంద్రబాబుని విమర్శించడమే వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ఉంది  
ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి విమర్శలు చేశారు. ‘ఏబీఎన్’ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘ఏపీలో తొమ్మిది నెలల వైసీపీ పాలనపై మీ కామెంట్ ఏంటి?’ అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, ‘వెరీ అన్ ఫార్చ్యునేట్’ అని అన్నారు. జగన్ తన అజెండా ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది తప్ప, కక్షా రాజకీయాలు అనవసరమని సూచించారు. మూడు రాజధానుల అంశం గురించి ప్రస్తావించగా, ఒక రాజధాని ఉంటేనే దిక్కు లేదని, మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల సామాన్యుడికి ఎంత మేరకు సౌకర్యంగా ఉంటుంది? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రులు మారినా ‘ప్రభుత్వం’ అనేది నిరంతరం కొనసాగుతుందని, ఈ విషయమే అర్థం కాకపోతే ఇంకేమంటామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏపీలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని, ముఖ్యంగా, సమయం అంతా వృథా అయిపోతోందని, ప్రజల మనోభావాలను ప్రభుత్వం తెలుసుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబునాయుడిని విమర్శించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని, ‘పిచ్చోడి చేతిలో రాయిలా’ ఏపీలో పరిస్థితి తయారైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


More Telugu News