బీజేపీ–జనసేన కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం: పురందేశ్వరి

  • విజయవాడలో ఇరుపార్టీల నేతల సమావేశం
  • సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై  ప్రధాన చర్చ
  • ఈ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ–జనసేన పొత్తు కుదర్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలో ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై  ప్రధానంగా చర్చ జరిగింది. బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆదినారాయణ రెడ్డి,  జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, శివశంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం, మీడియాతో పురందేశ్వరి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని, సమన్వయ కమిటీలతో ముందుకెళ్తామని చెప్పారు. తమ కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారని భావిస్తున్నానని అన్నారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ఆబరాగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు.

వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని వైసీపీ ఎన్నికలకు వెళ్తోందని, ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఉమ్మడి ప్రణాళికలతో ప్రజలకు మేలు జరిగేలా ముందుకెళ్తామని చెప్పారు. గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అందుకు కారణం కేంద్ర సహకారం ఉందన్న విషయం ప్రజలందరికీ  తెలుసని అన్నారు.


More Telugu News