హైదరాబాద్ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు అవసరం: హరీశ్ రావు
ఈ బడ్జెట్ లో రూ.10 వేల కోట్లు కేటాయించాం
కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడిగితే ఇవ్వలేదు
గోదావరి నది వద్ద పర్యాటక ప్రాజెక్టు చేపడతామని వెల్లడి
హైదరాబాద్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి రూ. 50 వేల కోట్లు అవసరమని గుర్తించామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్ లో రూ. 10 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో పెట్టిన కొత్త కార్యక్రమాలు, విధాన నిర్ణయాలు, పన్నులు, జీఎస్టీ పరిహారం, ఆర్థిక పరిస్థితిపై పలు వివరాలు వెల్లడించారు. కొన్ని అంశాలపై సందేహాలకు స్పష్టత ఇచ్చారు. హరీశ్ రావు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..
కేంద్రాన్ని నిధులడిగితే ఇవ్వలేదు..
‘‘సీఎం కేసీఆర్ సూచనల మేరకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు పెట్టాం. హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా స్పందన రాలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించాం. హైదరాబాద్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి రూ. 50 వేల కోట్లు అవసరమని గుర్తించాం. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్ లో రూ. 10 వేల కోట్లు కేటాయించాం.
38 మున్సిపాలిటీలకు రూ.800 కోట్లు
మిషన్ భగీరథలో 38 పట్టణాల పని అప్పగించిన ఏజెన్సీ మధ్యలో పని వదిలేసి వెళ్లింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిధులిచ్చి పనులను పూర్తి చేయాలని నిర్ణయించాం. యుద్ధ ప్రాతిపదికన మున్సిపాలిటీల్లో అంతర్గత పైపులైన్లు, కనెక్షన్లను ఏర్పాటు చేయిస్తాం. ఇందు కోసం రూ. 800 కోట్లు కేటాయించాం. సొంత స్థలాల్లో లక్ష మందికి డబుల్ ఇండ్ల నిర్మాణానికి అవకాశం ఇస్తున్నాం.
గోదావరి నది వద్ద పర్యాటక ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నదిలో సుమారు 150 కిలోమీటర్ల పొడవునా నిరంతరం నీరు నిలిచి ఉంటుంది. దాంతో ఆ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ఒక టూరిజం ప్రాజెక్టును అమలు చేయనున్నాం. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ. 300 కోట్లు ఇచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే హరిత హారం కార్యక్రమానికి రూ. 300 కోట్లు అదనంగా కేటాయించాం.’’