భారత అమ్మాయిల కల నెరవేరేనా? మరికొద్దిసేపట్లో టీ20 ప్రపంచకప్​ ఫైనల్​

  • తొలి వరల్డ్ కప్ పై భారత అమ్మాయిల గురి
  • ఐదోసారి విజేతగా నిలవాలని ఆసీస్ ఆరాటం
  • మ. 12.30 గంటల నుంచి టైటిల్ ఫైట్
  • రికార్డు స్థాయి ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం
మహిళల టీ20 ప్రపంచకప్‌లో అంతిమ పోరాటానికి రంగం సిద్ధమైంది. అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్, ఆతిథ్య ఆస్ట్రేలియా జట్లు మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో మొదలయ్యే టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆట మొదలవనుంది. ఏడు టోర్నీలు ఆడితే తొలిసారి ఫైనల్‌కు వచ్చిన భారత మహిళల జట్టు మొదటి కప్పును ముద్దాడాలని ఆశిస్తోంది. మరోవైపు రికార్డు స్థాయిలో ఆరోసారి ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఇప్పటికే అత్యధికంగా నాలుగుసార్లు కప్పు నెగ్గింది. అదే జోరుతో ఇప్పుడు ఐదోసారి విజేతగా నిలవాలని కోరుకుంటోంది. సొంతగడ్డపై ఆడడం ఆసీస్ టీమ్‌కు అనుకూలం కాగా, బలమైన జట్టుతో బరిలోకి దిగి టోర్నీలో అజేయంగా నిలవడం భారత్ బలం. నేడు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పుట్టిన రోజు కావడం విశేషం. దాంతో, జట్టును గెలిపించి ఈ రోజును చిరకాల జ్ఞాపకంగా మార్చుకోవాలని హర్మన్ కోరుకుంటోంది.

రికార్డు స్థాయిలో ప్రేక్షకులు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు జరుగుతున్న ఈ మ్యాచ్‌కు  90 వేల పైచిలుకు ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది. మహిళా క్రీడారంగంలో అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాచ్‌గా ఈ ఫైనల్ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. 1999లో అమెరికా లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగిన మహిళల సాకర్ వరల్డ్ కప్ ఫైనల్‌కు రికార్డు స్థాయిలో 90,185 మంది హాజరయ్యారు. ఇప్పుడు ఈ రికార్డును భారత్, ఆస్ట్రేలియా పోరు బద్దలు కొట్టే చాన్సుంది. లక్ష కెపాసిటీ ఉన్న స్టేడియం పూర్తిగా నిండిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఇక, మ్యాచ్‌కు వినోద కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అమెరికా పాప్ స్టార్ కేటీ పెర్రీ లైవ్ పెర్ఫామెన్స్ హైలైట్ గా నిలిచే అవకాశం ముంది.


More Telugu News