కరోనా టెన్షన్​ తగ్గకముందే.. కేరళలో బర్డ్​ ఫ్లూ ఎటాక్​

  • రెండు ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో గుర్తించిన అధికారులు
  • శాంపిళ్లను పరీక్షించి నిర్ధారించిన భోపాల్ లోని ప్రత్యేక ల్యాబ్
  • ఆందోళన అవసరం లేదంటున్న అధికారులు
దేశంలో మొదటగా కరోనా వైరస్ కేసులు నమోదైన కేరళలో తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం మొదలైంది. రెండు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్టు గుర్తించామని ఆ రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఆందోళనకరమైన వాతావరణం నెలకొనడం, మాంసం వినియోగానికి జనం దూరంగా ఉండటం నేపథ్యంలో బర్డ్ ఫ్లూ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఎలాంటి ఆందోళన వద్దని, ఇతర ప్రాంతాలు ఆ వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నామని కేరళ సర్కారు ప్రకటించింది.

కజికోడ్ జిల్లా పరిధిలో..

కేరళలోని కజికోడ్ జిల్లా పరిధిలో ఉన్న రెండు భారీ కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్టుగా గుర్తించామని కేరళ అటవీ, పశుసంవర్థక శాఖ మంత్రి కె.రాజు శనివారం వెల్లడించారు. రెండు రోజుల కింద శాంపిళ్లను మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న ల్యాబ్ కు పంపామని, బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్టు ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు. వెంటనే దగ్గరిలోని అన్ని పౌల్ట్రీ ఫారాలను మూసివేశామని, కోళ్లను చంపేసి, పూడ్చిపెట్టాలని ఆదేశించామని వెల్లడించారు. ఇందుకోసం 25 బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.

ప్రతి ఏటా వస్తూనే ఉంటుందన్న ఆరోగ్య మంత్రి

ఏటా ఈ సీజన్ లో బర్డ్ ఫ్లూ వస్తుండటం సాధారణమేనని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరమేదీ లేదని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ ప్రకటించారు. ఈ విషయంలో ఏం చేయాలో అది చేస్తామని తెలిపారు.


More Telugu News