ఎస్​ బ్యాంకు సంక్షోభం: ఏటీఎంలలో నో క్యాష్​.. పని చేయని నెట్​ బ్యాంకింగ్​

  • ఏటీఎంల ముందు బారులు తీరుతున్న ఎస్ బ్యాంకు ఖాతాదారులు
  • ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా పనిచేయడం లేదు
  • త్వరలో పరిస్థితి చక్కబడుతుందంటున్న అధికారులు
ఎస్ బ్యాంకుపై రిజర్వు బ్యాంకు ఆంక్షల నేపథ్యంలో గందరగోళం కొనసాగుతోంది. డిపాజిటర్లలో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. ఎక్కడా ఎస్ బ్యాంకు నెట్ బ్యాంకింగ్ పనిచేయడం లేదు. ఏటీఎంలలోనూ ఎక్కడా నగదు అందుబాటులో లేదు. ఉన్న చోట ఏటీఎంల ముందు ఖాతాదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. బ్యాంకు శాఖల్లోనూ పెద్ద సంఖ్యలో ఖాతాదారులు కనిపిస్తున్నారు. రిజర్వు బ్యాంకు అనుమతించిన మేరకు రూ.50 వేల చొప్పున ఉపసంహరించుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

భారీగా అప్పులిచ్చి.. దెబ్బతిని..

కొన్ని కార్పొరేట్ కంపెనీలకు భారీగా అప్పులిచ్చి, అవి వసూలు కాకపోవడంతో ఎస్ బ్యాంకు ఆర్థిక సంక్షోభంలో పడింది. దాంతో రిజర్వు బ్యాంకు కలుగజేసుకుంది. ఎస్ బ్యాంకును ఆర్థిక పునర్వ్యవస్థీకరణ, పునరుద్ధరణ నిబంధనల పరిధిలోకి తెచ్చింది. బ్యాంకు లావాదేవీలు, డిపాజిటర్లకు చెల్లింపులపై ఆంక్షలు విధించింది. వచ్చే నెల మూడో తేదీ వరకు మారటోరియం విధించింది. ఇది డిపాజిటర్లలో ఆందోళన రేకెత్తించింది.

చెక్కులు, క్రెడిట్, డెబిట్ కార్డులు పనిచేయడం లేదు

ఎస్ బ్యాంకు చెక్కులను చాలా చోట్ల స్వీకరించడం మానేశారు. ఢిల్లీలోని ఓ పోస్టాఫీసులో ఈ మేరకు బోర్డు కూడా పెట్టారు. 'రిజర్వు బ్యాంకు ఆదేశాలు వచ్చే వరకు ఎస్ బ్యాంకు చెక్కులు స్వీకరించబడవు' అని పేర్కొన్నారు. ఇక ఎస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వ్యాపార, వాణిజ్య లావాదేవీలకు పనిచేయడం లేదు. అయితే ఖాతాదారులెవరూ ఆందోళన చెందవద్దని, పరిస్థితి త్వరలో కుదుటపడుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.


More Telugu News