‘బ్రాహ్మణులకు మాత్రమే ఈ మరుగుదొడ్డి’ అంటూ కేరళలోని ఆలయం వద్ద బోర్డు.. ఇప్పుడు తొలగించిన వైనం!

  • కేరళలోని కుట్టుముక్కు మహాదేవ్ ఆలయ పరిసరాల్లో బోర్డు
  • పురుషులు, మహిళలు అంటూ రెండు మరుగుదొడ్లపై బోర్డు
  • మరో మరుగు దొడ్డిపై బ్రాహ్మణులకని బోర్డు
  • మరుగుదొడ్డి విషయంలోనూ వివక్ష అంటూ ట్వీట్లు
ఏ పబ్లిక్‌ టాయిలెట్‌ వద్ద అయినా పురుషులు, మహిళలకు అంటూ బోర్డులు కనపడతాయి. అయితే, వాటితో పాటు బ్రాహ్మణులకు అంటూ ఆ సామాజిక వర్గం వారికి ప్రత్యేకంగా ఉన్న పబ్లిక్‌ టాయిలెట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘బ్రాహ్మణులకు మాత్రమే ఈ టాయిలెట్’ అంటూ ఓ ఆలయం మరుగుదొడ్ల వద్ద బోర్డు కనపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... కేరళలోని  కుట్టుముక్కు మహాదేవ్ ఆలయ పరిసరాల్లో ఉండే మూడు టాయిలెట్ల వద్ద ఓ దానిపై ఈ బోర్డు కనపడింది. కేరళ రాష్ట్రానికే చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఒక టాయిలెట్‌పై పురుషులు అని, మరో దానిపై మహిళలు అని ఉంది.

అయితే, వాటి పక్కనే ఉన్న మరో మరుగుదొడ్డిపై బ్రాహ్మణులకి అని రాసి ఉంది. మరుగుదొడ్లు వినియోగించుకోవడంలోనూ వివక్ష అంటూ ఒకరు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడంతో, నెటిజన్ల దెబ్బకు స్పందించిన అధికారులు ఆ బోర్డును తొలగించారు.

ఈ బోర్డులను రెండు దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేశారని అధికారులు చెప్పారు. అయితే, ఇంతవరకూ వీటికి వ్యతిరేకంగా ఫిర్యాదు అందలేదని చెప్పారు. మొత్తానికి నెటిజన్ల దెబ్బకు మరుగుదొడ్ల వద్ద బ్రాహ్మణులు అని రాసిఉన్న ఆ బోర్డును తొలగించాల్సి వచ్చింది.


More Telugu News