డ్రెస్ మార్చుకుందామంటే ఒక హీరోయిన్ తన కారవాన్ లోకి నన్ను రానీయలేదు: సీనియర్ నటి కవిత

  • అప్పట్లో కారవాన్స్ ఉండేవి కావు 
  • అందరం కలిసిపోయి వుండేవాళ్లం
  • కల్యాణ మంటపంలో షూటింగు గురించి చెప్పిన కవిత
'కారవాన్' కల్చర్ గురించి ఇటీవల చిరంజీవి ప్రస్తావించిన దగ్గర నుంచి, ఆ విషయంపై నటీనటులు తమ అనుభవాలను .. అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటి కవిత మాట్లాడుతూ .. "మా అప్పట్లో కారవాన్స్ ఉండేవి కావు. అవుట్ డోర్లో జూనియర్ ఆర్టిస్టులు బెడ్ షీట్స్ ను అడ్డుగా పట్టుకుంటే, మేము డ్రెస్ మార్చుకునే వాళ్లం. అలాగే మేకప్ రూమ్ ను అంతా కలిసి షేర్ చేసుకునే వాళ్లం.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేను రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక షూటింగుకి వెళ్లాను. కల్యాణ మంటపంలో షూటింగ్. అక్కడ డ్రెస్ మార్చుకునే అవకాశం లేకపోవడంతో, హీరోయిన్ కారవాన్లో డ్రెస్ చేంజ్ చేసుకోమని ప్రొడక్షన్ వాళ్లు చెప్పారు. అప్పటికి కొత్తగా ఫీల్డ్ కి వచ్చిన ఆ హీరోయిన్ అందుకు ఒప్పుకోలేదు. తన కారవాన్ లోకి వేరెవరూ రావడానికి వీల్లేదని చెప్పేసింది. అప్పుడు ప్రభుదేవా తన కారవాన్ ఇచ్చి సహకరించారు. ఇప్పటికీ ఆ సంఘటన నాకు బాధ కలిగిస్తూనే ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.


More Telugu News