దేశం ఎదుర్కొంటున్న మూడు ఇబ్బందులకు.. పరిష్కార మార్గాలు సూచించిన మన్మోహన్ సింగ్

  • ఆర్థిక మందగమనం, సామాజిక అసమానత, కోవిడ్-19‌ ఇబ్బంది పెడుతున్నాయి
  • ఢిల్లీ అల్లర్లకు రాజకీయ వర్గాలు, సమాజంలోని కొందరే కారణం
  • పన్ను రేట్ల తగ్గింపు, విదేశీ పెట్టుబడులు దేశాన్ని కాపాడలేవు
దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దేశానికి ఉన్న గుర్తింపును ఇవి తగ్గిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ ఆంగ్ల పత్రికకు రాసిన కథనంలో మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రస్తుతం మూడు ప్రధానమైన సమస్యలతో బాధపడుతోందని, అవి ఆర్థిక మందగమనం, సామాజిక అసమానత, కోవిడ్-19 అని పేర్కొన్నారు. రాజకీయ వర్గాలతోపాటు సమాజంలోని కొందరు మతపరమైన అల్లర్లకు కారణమయ్యారని ఢిల్లీ హింసను పరోక్షంగా ప్రస్తావించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన సంస్థలతోపాటు, మీడియా కూడా ఈ విషయంలో విఫలమైందన్నారు.

దేశ ఆర్థికాభివృద్ధికి పునాదిలాంటి సామాజిక సామరస్యం ప్రమాదంలో పడినప్పుడు పన్ను రేట్ల తగ్గింపు, కార్పొరేట్ రాయితీలు, విదేశీ పెట్టుబడులు దేశాన్ని కాపాడలేవని అభిప్రాయపడ్డారు. మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ పూర్తిస్థాయిలో ప్రభావం చూపకముందే తగిన చర్యలు తీసుకోవాలని మన్మోహన్ కోరారు.

అలాగే, దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు తొలుత అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించి కరోనాను సమర్థంగా ఎదుర్కోవాలని, రెండోది పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించడమో, మార్పులు చేయడమో చేయాలని, చివరిగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు చక్కని ప్రణాళిక రూపొందించాలని మన్మోహన్ సూచించారు.


More Telugu News