లైసెన్స్ తీసుకున్న పది నిమిషాల్లోనే కారుతో నదిలోకి

  • సెల్ ఫోన్ చూస్తూ కారు నడిపిన డ్రైవర్
  • వంతెన పైనుంచి నదిలోకి దూసుకెళ్లిన కారు
  • చైనాలో జరిగిన ఘటన..  వైరల్ అయిన దృశ్యాలు
అతను డ్రైవింగ్ టెస్టుకు హాజరయ్యాడు. పరీక్షలో పాసయ్యాడు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని హుషారుగా కారెక్కాడు. తనకు లైసెన్స్ వచ్చిందన్న విషయం స్నేహితులు, సన్నిహితులతో పంచుకున్నాడు. దరిమిలా శుభాకాంక్షలు చెబుతూ అతని సెల్ ఫోన్ కు అనేక కాల్స్, సందేశాలు వస్తూనే ఉన్నాయి. వాటికి సమాధానం చెబుతూనే  డ్రైవింగ్ చేస్తున్న ఆ వ్యక్తి  ఓ వంతెన పైనుంచి కారుతో నదిలోకి దూసుకెళ్లాడు.

 దాంతో, లైసెన్స్ పొందిన ఆనందం పది నిమిషాల్లోనే ఆవిరైంది. చైనాలోని జున్యీ సిటీలో ఈ సంఘటన జరిగింది. గతనెల 21వ తేదీన జరిగిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఆ వ్యక్తి పేరు జాంగ్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా..  కారు నదిలోకి పడిపోతున్న దృశ్యాలు వంతెనపై ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పోలీసులు వాటిని పరిశీలించగా.. డ్రైవింగ్ చేస్తున్న జాంగ్ సెల్ ఫోన్ చూస్తూ బిజీగా ఉన్నాడని గుర్తించారు. అయితే, నీళ్లలో పడ్డాక కారు డోర్ పగలగొట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. కానీ, జాంగ్ కుడి భుజం విరిగిందని చెప్పారు. కాగా, జాంగ్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2017లో కూడా ఫోన్ మాట్లాడుతూ స్కూటర్ నడిపి యాక్సిడెంట్ చేశాడని పోలీసులు గుర్తించారు.


More Telugu News