అనుమానమే వద్దు...ఐపీఎల్ జరుగుతుంది: గంగూలీ అభయం

  • షెడ్యూల్ ప్రకారం లీగ్ మొదలవుతుందని స్పష్టం
  • ఆటగాళ్లు, అభిమానులకు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడి
  • ఈ నెల 29న మొదలవనున్న మెగా లీగ్
దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ పదమూడో సీజన్ నిర్వహణపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ నెల 29న మొదలయ్యే మెగా లీగ్ అనుకున్న సమయానికే జరుగుతుందా? వాయిదా పడుతుందా? అనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, వాటన్నింటికీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెరదించాడు.

ఐపీఎల్ పక్కాగా జరుగుతుందని, షెడ్యూల్ ప్రకారమే లీగ్ షురూ అవుతుందని స్పష్టం చేశాడు. ఈ విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చాడు. ‘ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా టోర్నమెంట్లు నడుస్తున్నాయి. ఇంగ్లండ్ జట్టు శ్రీలంకలో ఉంది. సౌతాఫ్రికా మనదేశానికి వచ్చింది. కౌంటీ జట్లు ప్రపంచం మొత్తం పయనిస్తున్నాయి. మ్యాచ్ లు  ఆడేందుకు అబుదాబీ, యూఏఈ వెళ్తున్నాయి. అందువల్ల క్రికెట్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఐపీఎల్ నిర్వహణకు కూడా సమస్యలు లేవు’అని గంగూలీ శుక్రవారం స్పష్టం చేశాడు

ఆటగాళ్లు, స్టేడియాలకు వచ్చే ప్రేక్షకులు కరోనా వైరస్ కు గురి కాకుండా ఉండేందుకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటామని దాదా తెలిపాడు. ఇందుకోసం బీసీసీఐ మెడికల్ టీమ్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిందని చెప్పాడు. ఆసుపత్రులతో సంప్రదింపులు జరుపుతున్న మెడికల్ టీమ్ ఇచ్చే సూచనలు పాటిస్తామని తెలిపాడు.


More Telugu News