భారత మహిళల జట్టుపై దక్షిణాఫ్రికా కెప్టెన్ వ్యంగ్యాస్త్రాలు

  • ఫైనల్ కు ఫ్రీ పాస్ దక్కించుకోవడం కంటే సెమీస్ లో  ఓడిపోవడమే మంచిదన్న నీకెర్క్
  • సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన సఫారీ టీమ్
  • ఇంగ్లండ్ తో సెమీస్ రద్దు కావడంతో ఫైనల్ చేరిన టీమిండియా
మహిళల టీ20 ప్రపంచకప్ లో తొలిసారి ఫైనల్ చేరాలన్న దక్షిణాఫ్రికా జట్టు ఆశ నెరవేరలేదు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో ఆ జట్టు ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. కంగారూ టీమ్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసినా ఛేదనకు ముందు వర్షం రావడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యాన్ని సవరించడం సౌతాఫ్రికాను దెబ్బతీసింది. చివరిదాకా పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయిన ఆ జట్టు నిరాశగా ఇంటిదారి పట్టింది. ఇక, ఇంగ్లండ్ తో మరో సెమీస్ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్ దశలో ఎక్కువ పాయింట్ల ఆధారంగా భారత్ ఫైనల్ చేరింది.

అయితే, తమ ఓటమి కంటే భారత్ ఫైనల్ చేరడాన్ని దక్షిణాఫ్రికా జట్టు జీర్ణించుకోలేకపోతున్నట్టుంది. సెమీస్ లో తలపడకుండా నేరుగా ఫైనల్లో అడుగుపెట్టిన టీమిండియాను సఫారీ టీమ్ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ పరోక్షంగా ఎత్తిపొడిచింది. ఉచితంగా ఫైనల్ చేరడం కంటే సెమీఫైనల్లో ఓడిపోవడమే ఉత్తమం అని భారత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆస్ట్రేలియాతో సెమీస్ లో తాము విజయం సాధించాలనే ఆడామని చెప్పింది. అంతేకాని వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దయితే గ్రూప్-బి టాపర్ గా నేరుగా ఫైనల్ చేరుకోవచ్చనే ఆలోచన తాము చేయలేదన్న నీకెర్క్.. ఫైనల్ కు ఫ్రీపాస్ దక్కించుకోవడం కంటే ఓడిపోవడమే మంచిదంటూ భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది.


More Telugu News