ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ముగ్గురు వైసీపీ అభ్యర్థుల ఖరారు.. నాలుగో అభ్యర్థిపై ఉత్కంఠ!

  • రాజ్యసభకు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి 
  • వైవీ సుబ్బారెడ్డి లేదా ఎంపీ పరిమళ్‌ సత్వానీల్లో ఒకరు
  • నాలుగో అభ్యర్థి పేరును ఖరారు చేయనున్న వైసీపీ
త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి వైసీపీ అభ్యర్థులు ఎవరనే విషయంపై స్పష్టత వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డిలను సీఎం జగన్‌ రాజ్యసభకు పంపనున్నట్లు తెలిసింది.

రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం నాలుగు సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సీట్లన్నీ వైసీపీకే దక్కనున్నాయి. నాలుగో సీటును ఎవరికి ఇస్తారన్న విషయంపై స్పష్టత రాలేదు. అయితే, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి లేదా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ సత్వానీకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
 
కాగా, అయోధ్య రామిరెడ్డి 2014 ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. దీంతో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తున్నారు. శాసనమండలి రద్దయ్యే అవకాశాలున్న నేపథ్యంలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లకు రాజ్యసభ సీట్లు ఇవ్వనున్నారు.

ఇక, ఎంపీ పరిమళ్‌ సత్వానీకి సీటు ఇవ్వాలని వైసీపీ యోచించడం వెనుక కారణాలున్నాయి. ఇటీవలే రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ.. జగన్‌తో ఇదే విషయంపై చర్చించారని తెలుస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ సత్వానీకి సీటు ఇవ్వాలని ముకేశ్ కోరినట్లు సమాచారం. అంతేగాక, ఆయనను ఇక్కడ నుంచి రాజ్యసభకు పంపితే రిలయన్స్‌ నుంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది.


More Telugu News