జలుబు, జ్వరం ఉంటే స్కూలుకు రావద్దు: తెలంగాణ సర్కారు ఆదేశం

  • రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • జిల్లాల పరిధిలో వైరస్ వ్యాప్తిని అరికట్టాలి
  • విద్యా శాఖ ఏడీజీ రమణ కుమార్
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఎవరికైనా జలుబు, జ్వరం ఉంటే, వారు స్కూలుకు రావద్దని పాఠశాల విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ సీహెచ్ రమణ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యాలయం, జిల్లాల పరిధిలో డీఈఓలు వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

విద్యార్థులైనా, టీచర్లకు అయినా జలుబు, జ్వరం, శ్వాస సంబంధింత సమస్యలుంటే, మూడు రోజులు బడికి రావద్దని, లక్షణాలు తగ్గేంత వరకూ చికిత్స తీసుకోవాలని విద్యా శాఖ కోరింది. ప్రతి సోమవారం పాఠశాల అసెంబ్లీలో వైరస్ పై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని, స్కూలు జరుగుతున్న సమయంలో కనీసం నాలుగు సార్లు చేతులను కడుక్కునేందుకు అవసరమైన లిక్విడ్స్ అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

ఇదే విషయాన్ని నోటీసు బోర్డుల్లో డిస్ ప్లే చేయాలని, స్కూలు తలుపులను సబ్బు నీటితో శుభ్రం చేయించాలని ఆదేశించింది. విద్యార్థులు తరచూ చేతులు కడుక్కుంటూ ఉండేలా చూడాలని సూచించింది. ఎవరైనా కరోనా బాధిత దేశాల నుంచి వచ్చిన వారి పిల్లలు స్కూల్ లో చదువుతుంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.


More Telugu News