ఒక్కో వివాహిత ఆరుగుర్ని కన్నా ఫర్వాలేదు: వెనిజులా అధ్యక్షుడి విపరీత వ్యాఖ్యలు

  • దేశం కోసం మహిళలు ఎక్కువ మంది బిడ్డలను కనాలని పిలుపు
  • అధ్యక్షుడి మానసిక స్థితి సరిగా లేనట్టుందన్న విపక్ష నేతలు
  • ఇవేం వ్యాఖ్యలంటూ మండిపడుతున్న హక్కుల సంఘాలు
ఓవైపు దేశంలో ఆర్థిక దుర్భిక్షం కొనసాగుతున్న తరుణంలో చంటిబిడ్డలకు పాలపొడి కూడా కొనలేని స్థితిలో వెనిజులా వాసులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో చేసిన వ్యాఖ్యలు వింటే ఆయనకు పిచ్చి పట్టిందనే అనుకుంటారు. వెనిజులా స్త్రీలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ, దేశ క్షేమం కోసం ఒక్కో వివాహిత ఆరుగురు బిడ్డలను కనాలని సూచించారు. జాతీయ మహిళా ఆరోగ్య కార్యక్రమంపై ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో మదురో ఈ వ్యాఖ్యలు చేశారు.

మదురో వ్యాఖ్యలతో విపక్ష నేతలు, హక్కుల కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలో సాధారణ జనజీవనం అత్యంత దయనీయ స్థితికి చేరిన నేపథ్యంలో, పిచ్చి పడితే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయరని జాతీయ అసెంబ్లీ సభ్యుడు మాన్యుయెలా బొలివర్ అభిప్రాయపడ్డారు. మదురో మానసిక స్థితి సరిగా లేనట్టుందని వ్యాఖ్యానించారు. అటు, హక్కుల సంఘాల నేతలు మదురో వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేశ పరిస్థితి ఎంత సంక్షుభితంగా ఉందో తెలిసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.


More Telugu News