పోలీసుల అదుపులో ఆప్‌ బహిష్కృత నేత తాహిర్‌‌ హుస్సేన్!

  • ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్‌ శర్మ హ్యత కేసులో నిందితుడు ‌‌
  • అరెస్ట్ చేయకుండా నిరోధించాలన్న హుస్సేన్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
  • కోర్టు ఆవరణలో హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారి అంకిత్ శర్మ దారుణ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత తాహిర్ హుస్సేన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసుల ముందు లొంగిపోవాలన్న ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.

ఢిల్లీలో అల్లర్లు, హత్య, కాల్పులకు పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్న తాహిర్‌‌ గురువారం కోర్టు ముందు హాజరయ్యాడు. అయితే, పోలీసులకు సరెండర్‌‌ కాకుండా చూడాలన్న ఆయన పిటిషన్‌ను కొట్టి వేసిన కోర్టు ఈ విషయం తమ పరిధిలో లేదని పేర్కొంది. దాంతో, కోర్టు ఆవరణలోనే పోలీసులు తాహిర్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.    

ఢిల్లీ అల్లర్ల సందర్భంగా దారుణ హ్యతకు గురైన అంకిత్ శర్మ మృతదేహాన్ని జఫ్రాబాద్‌లోని ఓ డ్రైనేజీ నుంచి బయటికి తీశారు. అంకిత్‌ హత్యకు తాహిర్‌‌ హుస్సేన్‌ ప్రధాన కారకుడని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అప్పటి నుంచి ఆయన తప్పించుకొని తిరుగుతున్నారని పోలీసులు చెబుతున్నారు. అంకిత్‌ శర్మ తండ్రి రవిందర్‌‌ శర్మ కూడా తన కుమారుడిని హత్య చేసింది తాహిరే అని ఆరోపిస్తున్నారు.  

తాహిర్‌‌పై మర్డర్‌‌ కేసు నమోదవడంతో పార్టీలో అతని ప్రాధమిక సభ్యత్యాన్ని ఆప్‌ రద్దు చేసింది. అయితే ఈ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాహిర్ అంటున్నారు. ఢిల్లీ అల్లర్లలో తాను, తన కుటుంబ సభ్యులం బాధితులయ్యామని చెబుతున్నారు. గత నెల 24వ తేదీన పోలీసులతో కలిసి తమ ఫ్యామిలీ మొత్తం సురక్షిత ప్రదేశానికి వెళ్లి తలదాచుకున్నామని చెప్పారు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదని తెలిపారు.


More Telugu News