మహిళల క్రికెట్ లో... పదహారేళ్లకే ప్రపంచ నంబర్​ వన్!​

  • టీ20 బ్యాటింగ్‌లో భారత క్రికెటర్‌‌ షెఫాలీ వర్మకు అగ్రస్థానం
  • 19 స్థానాలు మెరుగై టాప్‌ ప్లేస్‌ సాధించిన టీనేజ్‌ సెన్సేషన్‌
  • ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌‌గా రికార్డు
సాధారణంగా పదహారేళ్ల వయసు అమ్మాయి ఏం చేస్తుంది. మార్కుల కోసం కుస్తీ పడుతూ, ఆట పాటలతో బాల్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. కానీ, ఈ అమ్మాయి మాత్రం రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. మహిళల క్రికెట్‌లో రాకెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. పదహారేళ్ల వయసులోనే ప్రపంచ నంబర్‌‌ వన్‌ ర్యాంక్‌ సాధించింది. ఆమె మరెవరో కాదు. టీ20 ప్రపంచకప్‌లో చిచ్చరపిడుగులా చెలరేగుతున్న భారత యువ బ్యాటర్‌‌ షెఫాలీ వర్మ.

హర్యానాలో పుట్టిన ఈ అమ్మాయి ఐసీసీ మహిళల టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌ కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. మంగళవారం వరకు 20వ ప్లేస్‌లో ఉన్న వర్మ ఒక్క రోజులోనే 19 స్థానాలు ఎగబాకి నంబర్‌‌ వన్‌ అయింది. దాదాపు ఏడాదిన్నరగా టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్న న్యూజిలాండ్‌ క్రికెటర్‌‌ సుజీ  బేట్స్‌ను రెండో ర్యాంక్‌కు దించేసిన షెఫాలీ అగ్రస్థానం కైవసం చేసుకుంది. దాంతో, హైదరాబాదీ మిథాలీ రాజ్‌ తర్వాత టీ20 బ్యాటింగ్‌లో వరల్డ్‌ నంబర్‌‌ వన్‌ అయిన భారత రెండో క్రికెటర్‌‌గా నిలిచింది.

షెఫాలీ కేవలం 18 మ్యాచ్‌ల అనుభవంతోనే ఈ రికార్డు అందుకోవడం గమనార్హం. ఈ 18 టీ20ల్లో ఆమె 485 రన్స్ చేసింది. స్ట్రయిక్‌రేట్‌ 146 పైనే కావడం విశేషం. ఇక, టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ అదరగొట్టిన షెఫాలీ 161 పరుగులు సాధించి భారత్‌ను సెమీస్‌ చేర్చింది. గురువారం ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీస్‌ వర్షంతో రద్దు కావడంతో టీమిండియా తొలిసారి ఫైనల్‌ చేరింది.  ఇదే జోరుతో షెఫాలీ ఫైనల్లోనూ చెలరేగితే భారత్‌ కప్పుతో తిరిగిరావడం ఖాయం.


More Telugu News