యువతికి కూల్ డ్రింక్ ఆఫర్ చేసిన ఆటో డ్రైవర్... 8 నిమిషాల్లో వచ్చేసిన విజయవాడ పోలీసులు!

  • మత్తు మందు కలిపి ఉంటాడని అనుమానించిన యువతి
  • దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు
  • వెంటనే అలర్ట్ అయిన పోలీసులు
కృష్ణా జిల్లా కొల్లేటి కోట సమీపంలో తాను ఆపదలో ఉన్నానని గ్రహించిన ఓ యువతి, దిశ యాన్ ను ఆశ్రయించగా, పోలీసులు ఎనిమిది నిమిషాల్లో ఆమెను ట్రేస్ చేసి కాపాడారు. బాధితురాలిని రక్షించి, ఓ ఆటో డ్రైవర్ పై దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, తన ఆటోలో ఎక్కిన ఓ యువతికి ఆటో డ్రైవర్ కూల్ డ్రింక్ ను ఆఫర్ చేశాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఉంటాడని భావించిన ఆమె, తన ఫోన్ నుంచి దిశ యాప్ లో పోలీసులను కాంటాక్ట్ చేసింది. దిశ యాప్ లో ఎస్ఓఎస్ ఆప్షన్ ద్వారా సమాచారాన్ని అందుకున్న విజయవాడ కంట్రోల్ రూమ్ అధికారులు, వెంటనే కొల్లేటి కోట పోలీసులను అప్రమత్తం చేశారు.

ఆమెకు కాల్ కూడా చేయకుండా స్మార్ట్ ఫోన్ లొకేషన్ సిగ్నల్స్ ఆధారంగా ఆటోను ట్రేస్ చేశారు. ఆటోను నడిపిస్తున్న పెద్దిరాజు అనే యువకుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలు ఊహించినట్టుగానే, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపానని పెద్దిరాజు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.




More Telugu News