తెలంగాణలో ఎవరికీ ‘కరోనా’ సోకలేదు.. వదంతులు నమ్మొద్దు: మంత్రి ఈటల రాజేందర్​

  • తెలంగాణలో ఈ వైరస్ బారిన ఎవరూ పడలేదు
  • సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోంది
  • ‘కరోనా’పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది
తెలంగాణ రాష్ట్రంలో ’కరోనా‘ వైరస్ సోకిందన్న వదంతులను నమ్మొద్దని, ఈ వైరస్ బారిన ఎవరూ పడలేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ‘కరోనా’ వైరస్ వ్యాపించిందంటూ సోషల్ మీడియాతో దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ‘కరోనా’ గురించి తెలియకుండా కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఇలాంటివి తగదని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉందని ప్రకటించేది వైద్యులు మాత్రమేనని ఆఫీసులు, సంస్థలు కాదని అన్నారు.

హైటెక్ సిటీ ప్రాంతంలోని రహేజా మైండ్ స్పేస్ లోని ఐటీ కంపెనీలో పని చేస్తున్న ఒక ఉద్యోగినికి ‘కరోనా’ పాజిటివ్ రిపోర్ట్ నేపథ్యంలో అక్కడి కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇంటికి పంపించాయన్న వార్తల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ విషయమై కూడా మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. శానిటైజేషన్ లో భాగంగానే మైండ్ స్పేస్ లోని 20వ బిల్డింగ్ ను మాత్రమే ఖాళీ చేశారని స్పష్టం చేశారు.

‘కరోనా’పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని, వారి బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పుణేకు పంపామని అన్నారు.


More Telugu News