బెంగళూరు చేరిన మధ్యప్రదేశ్​ రాజకీయ డ్రామా

  • 3, 4 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించిన బీజేపీ
  • ఢిల్లీ వెళ్లిన సీఎం కమల్‌నాథ్‌
  • ఎంపీలో వేడెక్కిన రాజకీయం  
కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సారథ్యంలోని సర్కారును కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొనేలా ఉంది. ఈ ఎపిసోడ్‌కు ప్రధాన కారకులుగా భావిస్తున్న కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, నలుగురు అసంతృప్త ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బుధవారం తెల్లవారుజామున బెంగళూరుకు తరలించింది. అదే సమయంలో సీఎం కమల్‌నాథ్ ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏమోనని సర్వత్ర ఆసక్తి నెలకొంది.

మధ్యప్రదేశ్ మాజీ మంత్రి నరోత్తం మిశ్రా, బీజేపీ ఎమ్మెల్యే అర్వింద్ భడోరియా.. తమ శాసన సభ్యులను బెంగళూరుకు తరలించారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తమ ప్రభుత్వంలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు బలవంతంగా హరియాణాలోని ఓ హోటల్లో ఉంచారని కాంగ్రెస్‌ సీనియర్‌‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలను బయటకు తెచ్చేందుకు ఇద్దరు కాంగ్రెస్‌ మంత్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి బీఎస్‌పీ సభ్యురాలు రాంబాయ్‌ సహా ఇద్దరు ఎమ్మెల్యేలు వెనక్కిరావడంతో కాంగ్రెస్‌ కొంత విజయం సాధించినట్టయింది.

మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారు: దిగ్విజయ్

తమ ఎమ్మెల్యేలను కొనేసి.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అయితే, కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రభుత్వం బలంగా ఉందని, ఐదేళ్ల పాటు పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అన్నారు. కాగా, దిగ్విజయ్ ఆరోపణలను నరోత్తం మిశ్రా  ఖండించారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని, కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వంపై అసంతృప్తితోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరంగా వెళ్లిపోయారని చెప్పారు.


More Telugu News