తాలిబాన్ చీఫ్ తో 35 నిమిషాల పాటు మాట్లాడిన ట్రంప్!

  • తాలిబాన్ చీఫ్ బరాదర్ తో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్
  • మంచి చర్చ జరిగిందని ప్రకటించిన అమెరికా అధినేత
  • హింసను విడనాడాలని వారు కూడా భావిస్తున్నారంటూ వ్యాఖ్య
ఆఫ్ఘన్ ఉగ్రవాద సంస్థ తాలిబాన్ అధినేత ముల్లా బరాదర్ కు, తనకు మధ్య మంచి చర్చ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లో శాంతిని నెలకొల్పే క్రమంలో ఫలవంతమైన చర్చ జరిగిందని చెప్పారు.  ట్రంప్, బరాదర్ మధ్య దాదాపు 35 నిమిషాల పాటు ఫోన్ ద్వారా చర్చలు జరిగాయి.

బరాదర్ తో చర్చలు జరిపిన విషయాన్ని వాషింగ్టన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ట్రంప్ వెల్లడించారు. తాలిబాన్ నేతతో ఈ రోజు మంచి చర్చ జరిగిందని ఆయన చెప్పారు. బరాదర్ తో ఇంతకు ముందు కూడా మాట్లాడారా? అని మీడియా ప్రశ్నించగా... ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నారు. ముల్లా బరాదర్ తో మంచి సంబంధం నెలకొందని చెప్పారు. హింసకు తావు లేకుండా చేయాలని వారు కూడా అనుకుంటున్నారని తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి విడతల వారీగా తమ బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే, ఆఫ్ఘాన్ లో శాంతిని నెలకొల్పే దిశగా తాలిబాన్ నేతతో ట్రంప్ చర్చలు జరిపారు.


More Telugu News