రాంగ్‌కాల్‌ ద్వారా యువకుడి పరిచయం.. మందలిద్దామని వెళ్తే కిడ్నాప్ చేసి అత్యాచారం

  • గత నెల 25న ఘటన.. నిందితుల్లో బాలుడు 
  • పాడుబడిన స్కూల్ భవనంలో రెండు రోజులపాటు బందీగా యువతి
  • నిన్న ఆటోలో వెళ్తూ పోలీసులకు చిక్కిన నిందితులు
తనకొచ్చిన ఓ రాంగ్‌కాల్ ఓ యువతిపై అఘాయిత్యానికి కారణమైంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లిలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన యువతి కనిపించడం లేదంటూ గత నెల 27న పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల విచారణలో రాంగ్‌కాల్ విషయం బయటపడింది.

పోలీసుల కథనం ప్రకారం..  గత నెల రెండో తేదీన బాధిత యువతికి మంచిర్యాలకు చెందిన సాయికృష్ణ అనే యువకుడి నుంచి రాంగ్ ఫోన్‌కాల్ వచ్చింది. ఆ తర్వాత సాయికృష్ణ ఆ యువతికి పదేపదే ఫోన్ చేసి విసిగించేవాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అతడిని మందలించారు.

గత నెల 25న యువతికి మరోమారు ఫోన్ చేసిన యువకుడు మాట్లాడాలి రమ్మంటూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు పిలిచాడు. అతడిని గట్టిగా మందలించేందుకు ఇదే సమయమని భావించిన యువతి అక్కడికి వెళ్లింది. తన మిత్రుడు శివకృష్ణతో కలిసి అప్పటికే అక్కడికి ఆటోలో చేరుకున్న సాయికృష్ణ యువతి రాగానే బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని రామకృష్ణాపూర్‌‌లోని పాడుబడిన పాఠశాల భవనంలోకి తీసుకెళ్లాడు.

భవనంలో అప్పటికే బీజోన్‌కు చెందిన శశికాంత్, మరో బాలుడు ఉన్నారు. యువతి వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్న శశికాంత్ అందులోని సిమ్‌కార్డును తన మొబైల్‌లో వేసుకున్నాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజులపాటు బాధితురాలిని అదే భవనంలో ఉంచారు. గత నెల 27న రాత్రి శివకృష్ణ తన చెల్లెలు ఇంటికి ఆమెను తీసుకెళ్లాడు.

అక్కడి నుంచి తప్పించుకున్న యువతి బంధువులకు సమాచారం ఇచ్చి, వారి సాయంతో దండేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. నిన్న నిందితులందరూ కలిసి ఆటోలో కరీంనగర్ వైపు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. నిందితుల్లో ఒకడైన బాలుడిని హైదరాబాద్‌లోని జువైనల్ హోంకు తరలించారు.


More Telugu News