బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేయాలని జనసేన నిర్ణయం

  • బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు
  • బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు జరపాలన్న జనసేన
  • వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్ని ఎదుర్కొనే దమ్ములేదన్న జనసేన
బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. బీసీ రిజర్వేషన్ల కుదింపుపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో జనసేన సవాల్ చేయాలని నిర్ణయించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకువచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ అధినాయకత్వం డిమాండ్ చేసింది.

వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికలను ఎదుర్కొనే దమ్ములేదని తాజా పరిణామాలతో వెల్లడైందని, ప్రభుత్వ కుట్రను వెనుకబడిన తరగతులు గ్రహించాలని జనసేన నేతలు పేర్కొన్నారు. బీసీలకు అండగా జనసేన పోరాడుతుందని ఆ పార్టీ నేతలు శ్రీనివాస్ యాదవ్, పోతిన మహేశ్ వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బీసీ రిజర్వేషన్లపై నాటకాలు ఆడుతోందని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాల జాబితాలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చేరాయని ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సుప్రీం కోర్టు ద్వారా తెచ్చుకున్న 60.55 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.  సీఎం జగన్ కు నవరత్నాల అమలు మినహా మరే సమస్యా పట్టడంలేదని ఆరోపించారు.

అటు పోతిన మహేశ్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు వరకు బీసీ జపం చేసిన జగన్, ఎన్నికలయ్యాక ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. బీసీ డిక్లరేషన్ అని ప్రచారం చేశారని, కనీసం అమల్లో ఉన్న 34 శాతాన్ని కూడా ఎందుకు కొనసాగించలేకపోతున్నారని ప్రశ్నించారు. 48 శాతం బీసీ జనాభా ఉందన్న విషయాన్ని కోర్టుకు శాస్త్రీయంగా ఎందుకు చెప్పలేకపోయారంటూ నిలదీశారు. దీన్నిబట్టి కోర్టును ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించినట్టు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.


More Telugu News