లోకేశ్​ రాహుల్​ 0, మనీశ్​ పాండే 12.. రంజీ సెమీస్​లో భారత ఆటగాళ్ల ఫెయిల్

  • రంజీ సెమీస్‌లో నిరాశ పరిచిన లోకేశ్ రాహుల్, మనీశ్ పాండే
  • బెంగాల్‌ చేతిలో 174 పరుగుల తేడాతో కర్ణాటక చిత్తు
  • 13 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన బెంగాల్ జట్టు
ఈ మధ్య మంచి ఫామ్‌లో ఉండడంతో పాటు న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో రాణించిన టీమిండియా ఆటగాళ్లు లోకేశ్ రాహుల్, మనీశ్ పాండే రంజీ ట్రోఫీలో మాత్రం రాణించలేకపొతున్నారు. దాంతో, బెంగాల్‌తో జరిగిన రంజీ సెమీఫైనల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కర్ణాటక చిత్తుగా ఓడిపోయింది. బెంగాల్‌ నిర్దేశించిన 352 పరుగుల లక్ష్య ఛేదనలో కర్ణాటక 177 పరుగులకే కుప్పకూలింది.

స్టార్‌‌ ఓపెనర్‌‌ లోకేశ్‌ రాహుల్ (0) తన రెండో బాల్‌కే డకౌటవగా.. మనీశ్ పాండే 12 పరుగులకే పెవిలియన్‌ చేరి నిరాశ పరిచాడు. భారత జట్టుకు దూరమైన కర్ణాటక కెప్టెన్‌ కరుణ్ నాయర్‌‌ (6) కూడా ఫెయిలయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లోనూ రాహుల్, పాండే ఆకట్టుకోలేకపోవడం కర్ణాటకను దెబ్బతీసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 312 పరుగులకు ఆలౌటవగా.. ప్రతిగా కర్ణాటక 122 రన్స్‌కే కుప్పకూలింది. లోకేశ్ 26 రన్స్ చేస్తే.. మనీశ్ 12 పరుగులకే పరిమితమయ్యాడు. దాంతో కర్ణాటకపై 174 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన బెంగాల్‌ పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్ చేరింది.


More Telugu News