క్రికెటర్లకు కరోనా భయం.. 'నో షేక్‌హ్యాండ్' అంటున్న ఇంగ్లండ్ టీమ్!

  • శ్రీలంక టూర్‌‌లో ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేయమని ఇంగ్లండ్ కెప్టెన్‌ జో రూట్ ప్రకటన
  • దానికి బదులు ఫస్ట్ బంప్‌తో విష్ చేస్తామని వెల్లడి
  • ఇటీవల సౌతాఫ్రికా టూర్‌‌లో అనారోగ్యానికి గురైన ఇంగ్లండ్ ఆటగాళ్లు
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌.. ఆటగాళ్లను కూడా భయపెడుతోంది. కరోనా భయంతో ఇప్పటికే చాలా దేశాల్లో పలు టోర్నమెంట్లు వాయిదా పడడమో, రద్దవడమో జరుగుతుండగా తాజాగా క్రికెటర్లు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైరస్‌ ఇప్పుడు మనిషి నుంచి మనిషికి సోకే స్థాయిలో ఉండడంతో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని ఇంగ్లండ్‌ క్రికెట్ జట్టు నిర్ణయించుకుంది.

క్రికెట్‌లో తరచూ షేక్‌హ్యాండ్  ఇచ్చుకుంటారు. టాస్‌ మొదలు.. ఇన్నింగ్స్ పూర్తయినప్పుడు, మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆటగాళ్లు కరచాలనం చేస్తుంటారు. అయితే, రెండు టెస్టుల సిరీస్‌ కోసం త్వరలో శ్రీలంక టూర్‌‌కు వెళ్లనున్న ఇంగ్లండ్.. ఆ జట్టు ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వబోదట. దీనికి బదులుగా ఫస్ట్ బంప్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను విష్ చేస్తామని ఇంగ్లిష్ టీమ్‌ కెప్టెన్‌ జో రూట్ తెలిపాడు.

పిడికిలి బిగించి ఒకరి చేతిని మరొకరు తాకడాన్ని ఫస్ట్ బంప్ అంటారు. పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా పాప్యులర్. క్రికెట్‌లో కూడా ఫస్ట్ బంప్ తరచూ కనిపిస్తుంది. బ్యాటింగ్‌ చేస్తుండగా బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ ఫస్ట్‌ బంప్‌ చేస్తుంటారు. కాగా, ఇంగ్లండ్‌ క్రికెటర్లు షేక్ హ్యాండ్ వద్దనుకోవడానికి కరోనా భయమే కాదు, మరో కారణం కూడా ఉంది.

ఇటీవల సౌతాఫ్రికా టూర్‌‌కు వెళ్లిన ఆ జట్టు ఆటగాళ్లలో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. జీర్ణసంబంధ సమస్యలు, ఫ్లూ జ్వరంతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో వైద్య బృందం సూచనల మేరకు శ్రీలంకలో ఎవరితోనూ కరచాలనం చేయకూడదని, అలాగే వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులను కడుక్కొని యాంటీ బాక్టీరియల్ జెల్స్ వాడాలని నిర్ణయించారు.


More Telugu News