మోదీతో ఈ రెండు విషయాలపై చర్చించా: కేజ్రీవాల్

  • ఢిల్లీ అల్లర్లు, కరోనా వైరస్ పై చర్చించాం
  • ఢిల్లీ హింసకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరాను
  • కరోనాను ఎదుర్కొనేందుకు కలిసి పని చేయడంపై చర్చించాం
ప్రధాని మోదీతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భేటీ ముగిసింది. పార్లమెంటు ప్రాంగణంలో వీరి సమావేశం కొనసాగింది. సమావేశానంతరం మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీ అల్లర్లు, కరోనా వైరస్ పై ఇరువురం చర్చించామని తెలిపారు. ఢిల్లీ అల్లర్లకు ఎవరు కారణమైనా, ఏ పార్టీకి చెందినవారైనా వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానికి తాను చెప్పానని అన్నారు. దేశ రాజధానిలో ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని కోరానని చెప్పారు.  

 కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కలసికట్టుగా పని చేయడంపై కూడా ఇరువురం చర్చించామని కేజ్రీవాల్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోందని... ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణలో రెండు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విస్తరిస్తోందని తెలిపారు.

ఢిల్లీ అల్లర్లకు కారణంగా భావిస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలపై చర్చించారా? అనే మీడియా ప్రశ్నకు సమాధానంగా... ఈ అంశంపై ప్రత్యేకంగా ఎలాంటి చర్చ జరపలేదని చెప్పారు.


More Telugu News