రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టం: నారా లోకేశ్​

  • 9 నెలల పాలనలో 350 మంది రైతుల ఆత్మహత్యలు  
  • జగన్ రైతు వ్యతిరేకి.. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేవి?
  •  ‘తెలుగు రైతు’ వర్క్ షాప్ లో పాల్గొన్న నారా లోకేశ్
రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టమని, తుగ్లక్ 9 నెలల పాలనలో 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘తెలుగు రైతు’ వర్క్ షాప్ లో పాల్గొన్నానని, రైతులకు అండగా ఉంటూ వారి తరఫున పోరాడాలని వారికి దిశా నిర్దేశం చేశానని చెప్పారు. జగన్ రైతు వ్యతిరేకి అని, గతంలో రైతు రుణమాఫీ అవసరం లేదన్న ఆయన, ఇప్పుడు అనేక హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారని  విమర్శించారు.

రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. సున్న వడ్డీకే రుణాలు ఇస్తామన్న మాట మరిచారని, అసలు రుణాలు ఇస్తే చాలు అనే పరిస్థితి నెలకొందని అన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వెయ్యకముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తామని వైసీపీ తన మేనిఫెస్టోలో పెట్టారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.


More Telugu News