జమ్ములోని కూడలి పేరు 'భారత్ మాతా చౌక్'గా మార్పు!

  • ఓల్డ్ జమ్ములోని సిటీ చౌక్ పేరు మార్పు
  • ప్రజల్లో ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్న నగర డిప్యూటీ మేయర్
  • సర్క్యులర్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ కు 'అటల్ చౌక్'గా నామకరణం
జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ఆ తర్వాత ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత మరో కీలక మార్పు చోటు చేసుకుంది. పాత జమ్ము కమర్షియల్ హబ్ లో ఉన్న చారిత్రాత్మక 'సిటీ చౌక్' పేరును మార్చారు. సిటీ చౌక్ పేరును 'భారత్ మాతా చౌక్'గా మార్చారు. ఈ విషయాన్ని బీజేపీ అధికారంలో ఉన్న జమ్ము మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు.

ఇక సిటీ చౌక్ పేరు మార్పుపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఎక్కువ మంది పేరు మార్పును స్వాగతిస్తున్నారు. మరికొందరేమో పేరు మార్పు ముఖ్యం కాదని... నగర అభివృద్ధి, పరిశుభ్రతపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు, జమ్ము డిప్యూటీ మేయర్ పూర్ణిమ శర్మ మాట్లాడుతూ, సిటీ చౌక్ పేరును భారత్ మాతా చౌక్ గా మార్చాలంటూ నాలుగు నెలల క్రితం కార్పొరేషన్ సమావేశాల సందర్భంగా తాను డిమాండ్ చేశానని చెప్పారు. ప్రజలందరూ కూడా ఇదే కోరుకున్నారని తెలిపారు. తన డిమాండ్ మేరకు తీర్మానాన్ని స్వీకరించడం, ఆమోదించడం జరిగిపోయాయని చెప్పారు.

ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉందని... గతంలో ఎన్నో నిరసనలు, కీలక నిర్ణయాలకు సాక్షిగా ఉందని పూర్ణిమ తెలిపారు. ప్రతి రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం రోజుల్లో ఈ ప్రాంతంలో మువ్వన్నెల జాతీయ జెండాను ప్రజలు ఎగుర వేస్తుంటారని చెప్పారు. ఈ చౌక్ పేరును భారత్ మాతా చౌక్ గా మార్చాలనే డిమాండ్ ప్రజల్లో ఉందని అన్నారు.

దీనికి తోడు, జమ్ములోని పంజ్ తీర్థి వద్ద ఉన్న సర్క్యులర్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ కు దివంగత ప్రధాని స్మారకార్థం 'అటల్ చౌక్'గా నామకరణం చేశారు.

మరోవైపు, సిటీ చౌక్ పేరు మార్పుపై కనక్ మండి మార్కెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వి.గుప్తా అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగరంలో ఈ ప్రాంతం అత్యంత పురాతన నివాస ప్రాంతమని, పెద్ద బిజినెస్ ఏరియా అని ఆయన చెప్పారు. సిటీ చౌక్ పేరుతో ఇది ప్రసిద్ధిగాంచిందని తెలిపారు. స్థానికులను ఎవరినీ సంప్రదించకుండానే, రాత్రికి రాత్రే కొత్త పేరుతో కూడిన బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారని విమర్శించారు. పేరు మార్చడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు.


More Telugu News