కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. టెస్టు కెప్టెన్‌​గా తొలి వైట్​వాష్​

  • ఎనిమిదేళ్ల తర్వాత టెస్టుల్లో భారత్‌కు తొలి వైట్‌వాష్
  • చివరగా 2012లో ఆస్ట్రేలియా చేతిలో 0–4తో ఓడిన టీమిండియా
  • 2018 నుంచి విదేశాల్లో ఆడిన నాలుగు సిరీస్‌ల్లో మూడింటిలో ఓటమి
బ్యాటింగ్ వైఫల్యంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా ఓ చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టెస్టుల్లో భారత్ వైట్‌వాష్‌కు గురైంది. 2012లో ఆస్ట్రేలియా చేతిలో 0–4తో చిత్తుగా ఓడిన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో వైట్‌వాష్‌ అవడం ఇదే మొదటిసారి. అలాగే, విరాట్‌ కోహ్లీ కూడా టెస్టు కెప్టెన్‌గా తొలిసారి వైట్‌వాష్‌ ఓటమి రుచి చూశాడు.

ధోనీ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోహ్లీ ఒక్కసారి కూడా ఇంత ఘోర ఓటమిని ఎదుర్కొన్నది లేదు. అలాగే, 2018 నుంచి విదేశాల్లో ఆడిన నాలుగు సిరీస్‌ల్లో కోహ్లీసేన మూడింటిలో ఓడిపోవడం గమనార్హం. ఐదు టీ20ల సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసి న్యూజిలాండ్‌ పర్యటనను గొప్పగా ఆరంభించిన భారత్ తర్వాత అనూహ్యంగా తడబడింది. వన్డే సిరీస్‌లోనూ 0–3తో వైట్‌వాష్‌ అయిన కోహ్లీసేన తాజాగా టెస్టుల్లోనూ ఒక్క విజయం సాధించకుండానే వెనుదిరగడం శోచనీయం. తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో ఓడిన భారత్‌, సోమవారం ముగిసిన రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.



More Telugu News