అసలేం జరిగింది... హస్తినాపురం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్యపై అనుమానాలు!

  • కోట్ల ఆస్తివున్న మా అల్లుడికి అప్పు అవసరం ఏమిటంటున్న మామ 
  • దంపతుల మధ్య కూడా ఎటువంటి విభేదాలు లేవని వివరణ 
  • రూ.40 లక్షల కోసం ప్రాణం తీసుకుంటాడనుకోలేదంటున్న తండ్రి

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రదీప్ కుటుంబం బలవన్మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. హైదరాబాద్, హస్తినాపురం సంతోషిమాత కాలనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రదీప్‌(40), ఆయన భార్య స్వాతి(35), పిల్లలు కల్యాణ్‌ కృష్ణ(6), జయకృష్ణ(2)లు చనిపోయిన విషయం తెలియంది. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్ ను బట్టి తెలిసింది. అయితే, కుటుంబ సభ్యులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మంచి ఉద్యోగంతోపాటు కోట్ల ఆస్తికి వారసుడైన తన అల్లుడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రదీప్ భార్య స్వాతి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా తమ కూతురు, అల్లుడి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు కూడా లేవని, ఈ పరిస్థితుల్లో వారెందుకు చనిపోతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రదీప్ తండ్రి మాట్లాడుతూ కేవలం రూ.40 లక్షల కోసం ఇంత పని చేస్తాడని అనుకోలేదని చెబుతున్నారు.

శుక్రవారమే ప్రదీప్ తో మాట్లాడానని, కరీంనగర్ వెళ్తున్నట్లు తెలిపాడని, ఆదివారం కూడా ఎటువంటి ఫోన్ రాకపోవడంతో అనుమానం వచ్చి హస్తినాపురం వచ్చినట్లు ఆయన చెబుతున్నారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీసులు బలవంతంగా తలుపు తెరిచి చూడగా కొడుకు, కోడలు, మనుమలు విగతజీవులై కనిపించారని ఆయన భోరుమన్నారు.

'తాను బాగా బతకాలని కోరుకున్నానని, వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి పోవడంతో ఆ ఆశ అడియాశ అయ్యిందని, ఈ వయసులో నా కుటుంబం నీకు భారం అయి నువ్వు ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా' అంటూ ప్రదీప్ తండ్రికి లేఖ రాశాడు.



More Telugu News