రాజధానిపై జగన్ తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు: కన్నా

  • తుళ్లూరు వరకు సంఘీభావ ర్యాలీ చేపట్టిన కన్నా
  • విపక్షనేతగా అంగీరించి ఇప్పుడు మాట మార్చారంటూ జగన్ పై ధ్వజం
  • జగన్ పాలన కక్షసాధింపుగా ఉందని వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు నుంచి తుళ్లూరు వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతులకు మద్దతుగా బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన ర్యాలీ చేపట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి అనే మాటకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. త్వరలోనే దీనిపై కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. రాజధానిపై జగన్ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మద్దతు ఇచ్చి సీఎం అయ్యాక మార్చుతామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఏఏకు జగన్ మద్దతిస్తున్నారని ఆరోపించారు.

జగన్ పాలన కక్షసాధింపుగా కనిపిస్తోందని కన్నా అభిప్రాయపడ్డారు. నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, అన్ని చార్జీలను పెంచి పన్నులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్లినట్టుగా వైసీపీ పాలన ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోందని, ఇప్పటికే పూర్తయిన ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, మరోవైపు, రాజధాని పేరుతో తమ భూములు కబ్జా చేస్తారని విశాఖ వాసులు భయంతో ఉన్నారని కన్నా వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే టీడీపీకి వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రావని అన్నారు.


More Telugu News