మోదీ హయాంలోనే రక్షణ రంగంలో దూకుడు.. సర్జికల్ స్ట్రైక్స్ చేసే దేశాల జాబితాలో చేరాం: అమిత్ షా
మన దేశం ఎప్పటికీ ప్రపంచ శాంతిని కోరుకుంటుంది
మనం ఎవరిపైనా ముందుగా దాడి చేయం
అలాగని దేశంలో శాంతిని చెడగొడుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ హయాంలోనే దేశ రక్షణ రంగంలో దూకుడు పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. విదేశాంగ విధానానికి, డిఫెన్స్ పాలసీకి ముడిపెట్టడం మోదీ హయాంలోనే ఆగిపోయిందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ తరహాలో సర్జికల్ స్ట్రైక్స్ చేసే దేశాల జాబితాలో ఇండియా చేరిందని చెప్పారు. సోమవారం పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ జీ) నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు.
ఎప్పటికీ శాంతినే కోరుకుంటాం
భారత దేశం ఎప్పటికీ ప్రపంచ శాంతినే కోరుకుంటుందని అమిత్ షా అన్నారు. గత పది వేల ఏళ్ల చరిత్ర చూసినా భారత దేశం ఎప్పుడూ కావాలని ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు. అదే సమయంలో ఎవరూ మనపైకి దాడికి రానివ్వలేదని, మన దేశంలో శాంతిని చెడగొట్టే ప్రయత్నాలను సాగనివ్వలేదని గుర్తు చేశారు. మన సైనికుల ప్రాణాలు తీసుకునేవారికి తగిన విధంగా సమాధానం ఇస్తున్నామని పేర్కొన్నారు.
బెంగాల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అమిత్ షా కోల్ కతా వెళ్లారు. సోమవారం సాయంత్రం ఆ కార్యక్రమం జరగనుంది. అంతకన్నా ముందు నిర్వహించిన పలు అధికారిక కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొన్నారు. సాయంత్రం జరిగే సభలో మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారాన్ని మొదలుపెడతారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై, ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉందని రాజకీయవేత్తలు చెప్తున్నారు.