వారణాసి ఎయిర్ పోర్టులో మారిషస్ అధ్యక్షుడికి చేదు అనుభవం!

  • రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన పృథ్వీరాజ్ సింగ్
  • లగేజీ అదనంగా ఉందని చార్జీలు అడిగిన ఎయిర్ ఇండియా
  • ఉన్నతాధికారులు కల్పించుకుని సిబ్బందికి ఆదేశాలు
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు వచ్చిన మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌ సింగ్‌ కు, వారణాసి ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఆరుగురు ప్రతినిధులతో కలిసి ఇండియాకు వచ్చిన ఆయన, తిరిగి ఢిల్లీ వెళ్లే నిమిత్తం లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వేళ, ఎయిర్ ఇండియా సిబ్బంది వీరిని అడ్డుకున్నారు. వారి లగేజీ పరిమితికి మించి ఉందని, దానికి చార్జీలను చెల్లించిన తరువాతే విమానం ఎక్కనిస్తామని తేల్చి చెప్పారు.

 పృథ్వీరాజ్ సింగ్ తో ఉన్న దౌత్యాధికారులు, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కలుగజేసుకున్న అధికారులు ఎయిర్ ఇండియా సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పృథ్వీరాజ్‌ బృందాన్ని అడ్డుకున్నారని తెలిసి వెంటనే స్పందించామని ఎయిర్‌ పోర్టు డైరెక్టర్‌ అక్షదీప్‌ మాథుర్‌ వెల్లడించారు. ఇండియా పర్యటనకు వచ్చే ప్రముఖుల అదనపు లగేజీకి ఛార్జీలు వసూలు చేయవద్దని ఇప్పటికే ఎయిరిండియా సిబ్బందికి పౌర విమానయాన శాఖ సూచించిందని తెలిపారు.


More Telugu News