అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సిట్‌ దర్యాప్తు.. పలువురి ఇళ్లలో సోదాలు

  • విజయవాడలో తనిఖీలు
  • కొందరు కోటీశ్వరుల ఇళ్లలో పత్రాలు స్వాధీనం
  • తెల్ల రేషన్‌ కార్డుదారులు కొనుగోలు చేసిన భూములపై ఆరా
అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నిన్న విజయవాడలో తనిఖీలు చేసింది. టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం ఈ సోదాలు నిర్వహించింది.

అలాగే, విజయవాడ పటమటలోని కొందరు కోటీశ్వరుల ఇళ్లను కూడా తనిఖీ చేసినట్లు తెలిసింది. వారిలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు బంధువు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సోదాల్లో భాగంగా కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు బ్యాంకు లాకర్లను సిట్‌ స్వాధీనం చేసుకుంది.

వారి ఆస్తుల వివరాలు, అమరావతిలో కొన్న భూములపై అధికారులు వివరాలు సేకరించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసేందుకు సిట్‌కు ఏపీ ప్రభుత్వం అధికారాలిచ్చింది. అమరావతిలో 797 మంది తెల్ల రేషన్‌ కార్డుదారులు కొనుగోలు చేసిన భూముల వివరాలను పరిశీలించింది.

వారి పేరిట ఆ భూములను ఎవరైనా కొన్నారా? అన్న విషయాలను ఆరా తీస్తోంది. కాగా, సిట్‌ కార్యకలాపాలు ప్రస్తుతానికి విజయవాడ పోరంకి ప్రాంతంలోని ఇంటెలిజెన్స్‌ కార్యాలయం నుంచే కొనసాగుతున్నాయి.


More Telugu News