స్నేహితుడు హత్య, స్నేహితురాలి ఆత్మహత్య: బలికోరిన పాత పరిచయం!
- క్లాస్ మేట్ తో ఫేస్ బుక్ లో చాటింగ్
- అతని తీరు నచ్చక అనంతరం బ్రేకప్
- ఆ తర్వాత రెండు కుటుంబాల్లో విషాదం
ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారి వారిదే అయ్యింది. ఆమెకు పెళ్లయి కొడుకు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓరోజు ఫేస్ బుక్ లో క్లాస్ మేట్ పరిచయం అయ్యాడు. కలిసి చదువుకున్నాం కదా అని ఆమె చాటింగ్ చేసేది. పాత జ్ఞాపకాలు పంచుకునే వారు.
కాలక్రమంలో అతని తీరు బాగోక పోవడంతో ఆమె కటీఫ్ చెప్పేసింది. ఆ తర్వాతే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఒకరు హత్యకు గురయ్యారు. మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సినిమా థ్రిల్లర్ ను తలపించే ఈ ఘటనలు మహబూబ్ నగర్, గద్వాలా జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన కార్తీక్, రాగసుధ(29) కలసి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత రాగసుధకు మహబూబ్ నగర్‌కు చెందిన వ్యక్తితో వివాహం అవడంతో అత్తవారింటికి వెళ్లిపోయింది.
చాలా ఏళ్ల తర్వాత ఫేస్ బుక్ లో కార్తీక్ పరిచయం కావడంతో అప్పుడప్పుడూ అతనితో చాటింగ్ చేసేది. దీన్ని ఆసరాగా తీసుకుని కార్తీక్ అతిగా ప్రవర్తించడం మొదలు పెట్టడంతో అతనితో కటీఫ్ చెప్పేసింది. దీన్ని మనసులో పెట్టుకున్న కార్తీక్ రాగసుధకు, ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరిస్తుండేవాడు.
ఈ నేపథ్యంలో ఈనెల 24 నుం చి కార్తీక్ కనిపించకుండా పోయాడు. కార్తీక్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతని క్లాస్ మేట్లు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈలోగా గద్వాల మండలం కొండపల్లి గుట్టల వద్ద నెట్టెంపాడు కాలువలో గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు.
అది కార్తీక్ దేనని, మూడు రోజుల క్రితమే అతని తలపై రాళ్లతో మోది చంపేశారని పోలీసులు గుర్తించారు. కార్తీక్ హత్య జరిగిందన్న సమాచారం తెలుసుకున్న రాగసుధ మహబూబ్ నగర్ లోని అత్తవారింట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
చనిపోయే ముందు తన చావుకు కార్తీక్ కారణమంటూ లేఖ రాసి పెట్టింది. ఇరువర్గాల కుటుంబాలను విచారించిన పోలీసులు కార్తీక్ హత్యకు, రాగసుధ ఆత్మహత్యకు సంబంధం ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు విచారణ కొనసాగుతోంది.