బంగ్లాదేశ్ క్రికెటర్ సౌమ్య సర్కార్ పెళ్లిలో దొంగల బ్యాచ్.. రచ్చరచ్చ!

  • 19 ఏళ్ల ప్రియోంటి దేబ్‌నాథ్‌ను పెళ్లాడిన సౌమ్య సర్కార్
  • మొబైల్ ఫోన్ల దొంగతనంతో కలకలం
  • సౌమ్య కుటుంబ సభ్యులపై దొంగల ముఠా దాడి
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ సౌమ్య సర్కార్ పెళ్లి రచ్చరచ్చగా ముగిసింది. ఈ నెల 26న 19 ఏళ్ల ప్రియోంటి దేబ్‌నాథ్‌ను సౌమ్య సర్కార్ పెళ్లాడాడు. అయితే, ఈ పెళ్లి వేడుక అతనికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. పెళ్లికి హాజరైన వారిలో కొందరు దొంగలు అతిథుల ఫోన్లను చాకచక్యంగా దొంగిలించారు. ఫోన్లు కనిపించకపోవడంతో పెళ్లిలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. బాధితుల్లో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, క్రికెటర్ తండ్రి కూడా ఉన్నారు. అప్రమత్తమైన బాధితులు ఫోన్లు దొంగిలించినట్టుగా భావిస్తున్న అనుమానితులను పట్టుకున్నారు. దీంతో దొంగల గ్యాంగు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులపై దాడికి దిగింది. ఫలితంగా వేడుకలో రచ్చ మొదలైంది.

పెళ్లి కాస్తా రసాభాసగా మారింది. గొడవ మరింత ముదరడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో మిగతా పెళ్లి తంతు సజావుగా సాగింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులను సౌమ్య సర్కార్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.


More Telugu News