ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్... ముఖ్యమైన తేదీలివే!

  • ఏప్రిల్ 20 నుంచి పరీక్షలు
  • 24 వరకూ సాగనున్న ఎగ్జామ్స్
  • రూ. 10 వేల ఆలస్య రుసుముతో 19 వరకూ దరఖాస్తుకు చాన్స్
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 20 నుంచి 23 వరకూ ఇంజనీరింగ్, 23, 24 తేదీల్లో అగ్రికల్చర్, 22, 23 తేదీల్లో రెండు స్ట్రీమ్ లకు సంబంధించిన పరీక్షలు జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ వీ రవీంద్ర వెల్లడించారు. గత సంవత్సరం అమలు చేసిన నిబంధనలనే ఈ సంవత్సరం కూడా అమలు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలు కూడా మారబోవని, అయితే, అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ ఉన్న కారణంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి, కృష్ణా జిల్లా తిరువూరు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కొత్త సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లో మూడు పరీక్షా కేంద్రాలు ఉంటాయని, విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు కాల్ సెంటర్లను సైతం ఏర్పాటు చేశామని రవీంద్ర వెల్లడించారు. సెట్ నిర్వహణ వర్శిటీ అయిన కాకినాడలోని జేఎన్టీయూ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతాయని, ఈ నెల 29 నుంచి దరఖాస్తులను తీసుకుంటామని తెలిపారు.

మార్చి 29 దరఖాస్తుల సమర్పణకు తుది గడువని తెలిపిన ఆయన, రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 5 వరకూ, రూ. 1000 రుసుముతో 10వ తేదీ వరకూ, రూ. 5 వేల రుసుముతో 15వ తేదీ వరకూ, రూ. 10 వేల ఆలస్య రుసుమును చెల్లించి 19 వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు.

ఏప్రిల్ 16 నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ప్రతి రోజూ రెండు సెషన్లుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయని, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షలు రెండింటికీ హాజరు కావాలని భావించే వారు రూ. 1000 చెల్లించాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు https://sche.ap.gov.in/APSCHEHome.aspx వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.


More Telugu News