కేసీఆర్, జూపల్లి రామేశ్వరరావుల నుంచి ప్రాణహాని ఉంది: హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్

  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాకు ప్రభుత్వ పెద్దల నుంచే ప్రాణహాని ఉంది
  • 4+4 భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి
  • భద్రత పెంచాలని కేంద్రానికి రాసినా స్పందన లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న తనకు ప్రభుత్వ పెద్దల నుంచి ప్రాణహాని పొంచి వుందన్నారు. ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం లేదంటే, స్వతంత్ర ఏజెన్సీల నుంచి 4 ప్లస్ 4 గన్‌మెన్‌తో ఎస్కార్ట్ కల్పించాలని ఆదేశించాల్సిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

గతంలో తనకు 3 ప్లస్ 3 గన్‌మెన్‌తో రక్షణ ఉండేదని, ఆ తర్వాత దాన్ని 2 ప్లస్ 2కు తగ్గించినట్టు కోర్టుకు తెలిపారు. తన ప్రాణాలకు హాని ఉండడంతో భద్రత పెంచాలని కోరుతూ 28 ఆగస్టు 2019న కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే, అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, జూపల్లి రామేశ్వరరావులను రేవంత్‌రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు.


More Telugu News