విశాఖలో నిన్నటి పరిణామాలపై హైకోర్టులో పిటిషన్... విచారణ మార్చి 2కి వాయిదా

  • ఉత్తరాంధ్ర పర్యటన కోసం నిన్న విశాఖ వెళ్లిన చంద్రబాబు
  • బాబును అడ్డగించిన వైసీపీ కార్యకర్తలు
  • చంద్రబాబును హైదరాబాద్ పంపించివేసిన పోలీసులు
  • పోలీసుల వైఖరి పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ నేత పిటిషన్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర పర్యటన కోసం నిన్న విశాఖ వెళ్లగా, అక్కడ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆపై పోలీసులు ఆయనను హైదరాబాద్ పంపించారు. చంద్రబాబు పట్ల పోలీసుల వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ శ్రవణ్ కుమార్ తన పిటిషన్ లో ఆరోపించారు. ఈ అంశంలో హోంశాఖ కార్యదర్శి, విశాఖ పోలీస్ కమిషనర్, ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు వినడం జరిగింది. ఈ సందర్భంగా, ఉత్తరాంధ్ర పర్యటన కోసం చంద్రబాబు ముందుగానే అనుమతి తీసుకున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కాగా, చంద్రబాబుకు విశాఖలో సెక్షన్ 151 కింద నోటీసులు ఇవ్వడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఆ సెక్షన్ కింద ఎలా నోటీసులు ఇచ్చారంటూ పోలీసులను ప్రశ్నించారు. దీనిపై సమగ్ర అఫిడవిట్ ఫైల్ చేయాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేశారు.


More Telugu News