ఓ ఉద్యోగికి కరోనా.. ఫ్యాక్టరీ మూసేసిన హుండై కార్ల కంపెనీ

  • దక్షిణ కొరియాలో విపరీతంగా వ్యాప్తి చెందుతున్న వైరస్
  • శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 256 కేసుల నమోదు
  • ముందు జాగ్రత్తగా వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని రద్దు చేసిన భారత్
ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో హుండై కార్ల కంపెనీ దక్షిణ కొరియాలోని ఉల్సాన్ లో ఉన్న తమ కార్ల తయారీ ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేసింది. ఆ ఉద్యోగితోపాటు కలిసి పని చేసిన మరికొందరు ఉద్యోగులను కూడా హాస్పిటల్ కు తరలించి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే చైనాలోని హుండై పరిశ్రమల్లో చాలా వరకు మూసివేసి ఉండగా.. కొన్నింటిలో మాత్రమే అరకొరగా కార్ల విడిభాగాలు తయారవుతున్నాయి. ఇప్పుడు దక్షిణ కొరియాలోనూ అదే పరిస్థితి నెలకొంది.

దక్షిణ కొరియాలో భారీగా వ్యాపిస్తున్న కరోనా

వైరస్ వ్యాప్తికి మూల కేంద్రమైన చైనా తర్వాత దక్షిణ కొరియాలోనే వైరస్ దాడి ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు దక్షిణ కొరియాలో 2 వేల మందికిపైగా వైరస్ బారినపడగా.. అందులో ఒక్క శుక్రవారమే 256 కేసులు నమోదవడం గమనార్హం. దీంతో ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. హుండైకి కొరియాలోని ఉల్సాన్ లోనే ఐదు అతిపెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవి ఏటా కోటిన్నర వాహనాలు తయారు చేసే సామర్థ్యం గలవి. వాటిల్లో 34 వేల మందికిపైగా పనిచేస్తున్నారు.

దక్షిణ కొరియా, జపాన్ లకు వీసా ఆన్ అరైవల్ రద్దు

జపాన్, దక్షిణ కొరియాల్లో కరోనా వైరస్ భారీగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ రెండు దేశాల నుంచి వచ్చే వారికి వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. వీసా ఆన్ అరైవల్ అంటే.. ఆయా దేశాల వారు ముందుగా ఇండియా వీసా తీసుకోకుండానే నేరుగా ఇక్కడికి రావడానికి వీలుంటుంది. ఇక్కడికి వచ్చాక ఎయిర్ పోర్టులోనే వీసా తీసుకోవచ్చు.
  • మామూలుగా అయితే ఆయా దేశాల్లోని మన ఎంబసీలను సంప్రదించి వీసా తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా వచ్చే వారితో కరోనా వైరస్ వ్యాపించవచ్చన్న ఉద్దేశంతో వీసా ఆన్ అరైవల్ ను తాత్కాలికంగా రద్దు చేశారు.
  • ఇంతకుముందే చైనా వాళ్లకు కూడా ఈ సదుపాయాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది.


More Telugu News